Sunday, February 22, 2009

శాకాహారం 1

I. శాకాహారం మాత్రమే ఎందుకు?
II. మాంసాహారం ఎందుకు వద్దు?
III. మాంసాహారం తినకపోతే బలం ఎలా వస్తుంది?
IV. జంతువులూ, పక్షులూ మనకోసమే పుట్టాయి కదా?
V. తింటే నష్టం ఏంటి? తినకపొతే వచ్చే లాభం ఏంటి?
ఇలాంటి ప్రశ్నలు మనకు వస్తూంటాయి.......మరి వాటి జవాబులు ఒకసారి చూద్దాము...
ముందు క్లుప్తంగా.....
Iవ ప్రశ్నకు
ఎందుకంటే మన ఆరోగ్యం కోసం
II వ ప్రశ్నకు
అనేక రకాల అనారొగ్యాలను దూరం చేసుకొటానికి....., సూటిగా చెప్పాలంటే (సుత్తి లేకుండా...) మనం మనుషులం కాబట్టి.
III వ ప్రశ్నకు
మాంసాహారం తినకపొతే శక్తి రాదు అనేది ఒక అపోహ మాత్రమే తినని ఏనుగు, గుర్రం లకు బలం ఎలావస్తోంది....
IV వ ప్రశ్నకు
అలాగా! మరి మనం ఎవరి కొసం పుట్టాం..! పులి, సింహం, మొసలి లాంటి వాటికి ఆహారంగా కావటానికే మనిషి పుట్టాడు అనుకోవచ్చు కదా!
V వ ప్రశ్నకు
దీనికి జవాబు తర్వాత... అసలు చిన్న చీమ కాని, దోమ కాని కుడితేనే సహించలేని, వాటిని చంపే దాకా ఒదలని మనకు.... నష్టం,లాభంల గురించి అడిగే హక్కు ఎక్కడిది?

పై ప్రశ్నలన్నిటికీ సశాస్త్రీయ వివరణలు చూద్దాం....

ఈ నేలపై రెండు రకాల జీవులు ఉన్నాయి..... 1. శాకాహారులు 2. మాంసాహారులు. ఇది మనకందరికీ తెలిసిన విషయమే... ఐతే ఈ రెండింటిలో చాలా వ్యత్యాసముంది.

మొదటిది ' వాటి పళ్ళ నిర్మాణం '

మాంసాహారులైన జంతువులకు వాడియైనపళ్ళు (కోరలు) ఉంటాయి. ఎందుకంటే అవి మాంసాన్ని నమిలి, ముక్కలు చేయవలసి ఉంటుంది. ఆకులు, గడ్డి, కూరగాయలు తినే ప్రాణుల పళ్ళు వాడి గా ఉండవు. వాటి పళ్ళ నిర్మాణమును గమనించినట్టయితే సమతుల్యంగా ఉంటుంది. ఏవైతే ఆకులు, పండ్లు, కాయగూరలు, గడ్డి తింటాయో, గీరుట, ముక్కలు చేయుట ఉండదు కనక దంతములు సమతులంగా ఉండును. ఒకటి పొడవు, మరొకటి వెలుపలికి పొడుచుకు వచ్చినది, ఇంకొకటి వాడియైన దంతములు ఇలా ఉండవు. ఏవైతే పెల్లగించవలసి ఉంటుందో పై దవడలో 2 క్రింద దవడలో 2 వాడియైన దంతాలను ప్రకృతి ఇచ్చింది. వాటి ముందరి దంతాలు పొడవుగా ఉంటాయి. ముందరి 4 పళ్ళతో 5 వ మరియు 6వ నంబరు పన్ను ఎక్కువ పొడవు మరియు వాడియైనదిగా ఉంటుంది. ఇలాంటి రెండు రకాల జంతువులే ఉంటాయి . ఆకులు, అలములు తినేవి లేదా మంసాహారం తినేవి.

పులి, నక్క, చిరుత దంతాలు చూడండి.. వీటికి నాలుగు వాడియైన దంతాలుంటాయి... చూడనిచో ఓసారి జంతు ప్రదర్శనశాలకెళ్ళండి. పులి నోరు తెరచి ఎలా చూడమని అంటారా? అంత శ్రమ అక్కరలేదు! మన చుట్టుప్రక్కల తిరిగే పిల్లి లేదా కుక్క నోటిని చూడండి. లేదంటే డిస్కవరి చానెల్ లేదా యానిమల్ ప్లానెట్ లో చూడవచ్చును. నక్క, పులి, గుంటనక్క, పెద్దపులి యొక్క దవడ దంతాలు వాడిగా, తీక్షణంగా ఉంటాయి మరియు పొడవుగా ఉంటాయి. వాటి ముందరి దంతాలు పొడవే ఉంటాయి. వెనకాల కోర దంతాలు చిన్నవిగా ఉంటాయి.

ఇక మేక దంతాలు చూడండి. ఆవు దంతాలు పరీక్షించండి. వీటి దవడలు ఎలా ఉంటాయి? ఏదంతమూ వాడిగా ఉండదు. కోతి, లేడి లను చూడండి. ఎలా ఉంటాయి వీటి పళ్ళు? వాడిగానా? లేదు! ఆవు, గుర్రం, గాడిద, ఎద్దు వీటన్ని దవడలు వెడల్పు ఉంటాయి. సరే వీటితో మన దవడలు పోల్చుకొంటే మన దవడ పులిని పోలి ఉందా? లేదా పెద్దపులి పిల్లతో పోలిక ఉందా? నక్కను పోలి ఉందా? కోతి, మేకతో పోలిక ఉంటుంది. మనిషి దవడ శాకాహార ప్రాణులతో కలుస్తుంది.

రెండవ ముఖ్యమైన తేడా ఏమిటనగా
' మాంసాహార ప్రాణుల ప్రేగులు శాకాహార ప్రాణుల ప్రేగులతో పోలిస్తే భిన్నంగా ఉంటాయి '

మాంసం తినడం మరియు జీర్ణిచుకోవడానికి ఎక్కువ సమయం పడుతుంది. అందుకే వీటి ప్రేగులు చిన్నవిగా ఉంటాయి. అవి ఎక్కువ శ్రమపడాల్సి ఉంటుంది. ఎక్కువ పని చేయవలసి ఉంటుంది. అందుచేత ఒకేచోట పూర్తి వ్యవస్థ, ప్రణాళిక రూపొందినది. ఆకులు, అలములు, కూరగాయలు తినే శకాహార ప్రాణులకు ఆహారం జీర్ణం కావడానికి ఎక్కువ సమయం పట్టదు. శరీరంలో జీర్ణక్రియ మెల్లగా జరుగుతుంది కనుక ఎక్కువ భారం పడదు. అందువల్ల వీటి మరియు మనుషుల ప్రేగులు ఎక్కువ పొడవుగా ఉంటాయి. ఈ రెండింటి శరీర నిర్మాణం పూర్తిగా భిన్నంగా ఉంది. పులి, గుంటనక్క, నక్క యొక్క ప్రేగులు చిన్నగా ఉంటాయి. ప్రకృ తి అన్నింటిని అర్థం చేసుకుంటుంది. సృష్టికర్త కూడా చాలా తెలివైనవాడే...అందుకే ఆయన ఎలాంటి ప్రాణికి అలాంటి శరీరాన్ని ఇచ్చాడు.
కొందరంటారు... మాంసం తినరా? మరి శరీరంలోకి ప్రోటీన్లు ఎలా వస్తాయి?
రోగాల బారినపడతారు అంటారు... మనమేమన్న పహిల్వాన్ అయి కుస్తీపోటీలో పాల్గొనాల్సి ఉందా? దేని కోసం కావాలి శక్తి? మరి అన్నిటికన్నా బలిష్టమైన జంతువేది? ఏనుగు! ఇక ఏనుగు ఎప్పుడూ మెక్డొనాల్డ్ బర్గర్ కానీ, కోడిమాంసం గానీ తినలేదు. కాలేయం - తల! అయ్యో! అయ్యో! కాలేయం కూడా ఒలుచుకుని తింటారు....
అన్నిటికన్నా శక్తివంతమైన ప్రాణి ఏనుగు శాకాహారి. కాయగూరలు తింటుంది కాని మాంసం ఎన్నడూ తినదు. మరి శక్తిలో దానికి పోటీ ఉందా?
పరుగెత్తుటలో శక్తిశాలి గుర్రం! అదేం తింటుంది? శాకాహారం! మీరే చూడండి, అన్ని వాహనాలు, బస్సు, విమానం, యొక్క శక్తిని కొలిచే ప్రమాణం అశ్వశక్తి! ' హార్స్ పవర్ ' అని అంటాము కాని ' మాన్ పవర్ ' అనం. ఈ ప్రాణులలో శక్తి లేదని ఎవరంటారు చెప్పండి, శక్తి విషయంలో ఏమైనా లోపమున్నదా వీటిలో?

బలం మాటకొస్తే, మాంసం తినకుంటే బలం ఎలా వస్తుంది? ఒక్క ఉదాహరణ చూడండి.
ఒక వ్యక్తి 100 గ్రా. మాంసం తింటే ఎంత శక్తి వస్తుందో, అంతే శక్తి 40 గ్రా. వేరుశెనగ తిన్నా సమకూరుతుంది. వేరుశెనగ, సోయాచిక్కుడు, పప్పుదినుసులు తినడం వలన ఎలంటి నష్టం కలుగదు. దేనినీ వధించినట్లూ కాదు. జీవహింస లేకుండా ఎంతటి శక్తినైనా పొందవచ్చును. మీకు కుదిరితే మీరొక చలన చిత్రం (మూవీ) చూడండి, మీ పిల్లలకూ చూపించండి. అదొక హాలివుడ్ బ్లాక్ బస్టర్ చిత్రం, దాని పేరు, " దబేబ్ " ! మరో చిత్రం దాని పేరు " చికన్స్ ఫ్లయిట్ " దీనిని కూడాచూడండి. ఆపై మీరు అర్థం చేసుకుంటారు మీరు వాటిని చంపడానికి ఎలా సిద్ధమౌతున్నారో, ఆ కోళ్ళు, టర్కీలు మీ గురించి ఏమనుకుంటున్నాయో. చావునుండి బయటపడడానికి ప్రయత్నించి అవి విఫలమౌతాయి. "దబేబ్ " అనేది ఒక పంది పిల్ల గురించిన కథ! ఈ చిత్రం తప్పక చూడండి.

ఏం తినాలి?

మీ శరీరంలో రోగాలు ఉత్పన్నం చేయనట్టి ఆహారం తీసుకోవాలి
మాంసం తినేవారికి తెలుసా? వారు జంతువును తినేముందు దానికి ఎలాంటి జబ్బు ఉన్నదో? వింతైన ఎలర్జీలు మరియు రోగాలు మనిషి శరీరం పై దాడి చేయడం చూసి డాక్టర్లే ఆశ్చర్యపోతున్నారు. ఈ కొత్తకొత్త రోగాలు ఎక్కడినుండి పుట్టుకొస్తాయో? జబ్బుపడిన జంతువులను తినేవాడు ఒక్కవిషయం గుర్తుంచుకోవాలి. పశువులు అధిక పాలిచ్చేందుకు వాటికి మందులు, ఇంజెక్షన్లు ఇస్తారు. ఇలాంటి జంతువులను తినరాదు. వాటికి ఉన్న జబ్బులు మనిషి శరీరంలో విభిన్నరీతిలో బయటపడతాయి. అది మొండి జబ్బుగా ఉండిపోయే అవకాశముంది.

మాంసాహార జంతువుల జీర్ణ కోశంలో హైడ్రోక్లోరిక్ ఆసిడ్ ఎక్కువగా ఉండటంతో సులభంగా జీర్ణం చేసుకోగలవు. శాకాహార జంతువులలో చాలా తక్కువ ఉండటం వల్ల మాంసాన్ని అంత సులభంగా జీర్ణం చేసుకోలేవు.

" మాంసాహారం తినే జంతువులు నాలుకను బయటకు చాపి నీళ్ళు త్రాగుతాయి..
శాకాహారం తినే జంతువులు నీరు త్రాగడానికి పెదవులను వినియోగిస్తాయి "

జంతువధశాలలో మరణానికి ముందు నిస్సహాయ స్థితి లో జంతువు తనను తాను రక్షించుకోవడానికి విశ్వప్రయత్నం చేస్తూ దాని కోసం పోరాడుతుంది. ఎప్పుడు పోరాటం విఫలమౌతుందో దాని భయాందోళనలు తీవ్ర స్థాయికి చేరి, కళ్ళు క్రోధంలో ఎరుపెక్కి నోటినుంచి నురగలు వెలువడుతాయి. ఈ స్థితి జంతుశరీరంలోని 'ఆడ్రెనాలిన్ ' అనబడే ఓ పదార్థం ఏర్పడి, రక్తపుపోటు అధికమై రక్తం కలుషితమవుతుంది. ఇలాంటి మాంసాన్ని మనిషి తింటే, ఈ ' ఆడ్రెనాలిన్ ' మనిషి లో కూడా ప్రవేశించి అతనికి అనేక ప్రాణాంతక వ్యాధులు కలుగ చేస్తుంది. జంతువు మరణించిన వెంటనే సకల జీవ పరిరక్షాక్రియలు ఆగిపోయి, బ్యాక్టీరియా, వైరస్ తో కూడిన అంటురోగాలు శరీరంలో వ్యాపిస్తాయి.

హృద్రోగులలో శాకాహారులకన్నా మాంసాహారులే అధికం అని అన్ని సర్వేలు చెబుతున్నాయని ఏ అరోగ్య అర్టికల్ చూసినా తెలుస్తుంది.

ఇక్కడ మరొక ముఖ్యమైన విషయాన్ని గురించి చూద్దాం....!

" సామాజిక మరియు భౌగోళిక వ్యవస్థలు "

ఒకానొకప్పుడు ప్రపంచంలో ఎడారి ప్రాంతంలో అనేకచోట్ల ఏం పండించాలన్నా కష్టంగా ఉండేది. అక్కడి భూమి సారవంతమైనది కాదు. చాలా సందర్భాలలో నీటి ఒడ్డున గల భూమి కూడా రాళ్ళు లేదా ఇసుకతో కూడి ఉండేది. సారవంతమైన నేల లేకపోతే మనిషి ఏమి విత్తగలడు? ఏమి పండించగలడు?
ఈరోజు పరిస్థితి ఇలాలేదు. టోరంటోలో ఉంటూ మెక్సికో మామిడి తినవచ్చును. కెనడాలో ఉంటూ ఇండియా కూరగాయలు పొందవచ్చును. విమానాలు మరియు ఓడల ద్వారా సరుకులు ఒకచోట నుండి మరిక చోటికి తక్కువ సమయంలో చేరవేయబడుచున్నవి. కాని ఆరోజుల్లో ఇలా జరిగేది కాదు. మనిషి బతకాలంటే శరీర రక్షణకై ఎంతో కొంత తినక తప్పదు. అందుకే అప్పటి మనుషులు వారికి కనిపించిన బలహీన జీవరాశులను చంపితినేవారు.

ఐతే ఈనాడు కూడా మనం ఆధునిక నాగరికులమని పిలువబడతామని వారనుకొంటారు. ఒక చేతిలో కోడికాలు మరో చేతిలో సారాగ్లాసు పట్టుకుని విద్యావంతులు తాము ఆధునికులమని విర్రవీగుతారెందుకో? నేటి తరానికి ఎక్కడ ఏ వస్తువుకీ కొరత లేదు అనేది అందరూ ఒప్పుకునే విషయం.

ప్రతిచోటా అన్నీ దొరుకుతాయి. బర్మింగ్ హాంలో ఉన్న మీరు బంగినపల్లి లేదా ముంబాయి మామిడిపండ్లు తినవచ్చును. తినడం లేదా? ఫలానా దేశపు సదరువస్తువులు శ్రేష్టమైనవని అంటూ ఉంటారు. స్వీడన్ వస్తువులు మంచివి, ఇంగ్లాండ్ పాలు బాగుంటాయని, ఇండియా మామిడి, బాసుమతి బియ్యం ప్రసిద్ధములని అంటారు. ఒక దేశంలో మీరు నివసిస్తుండగా వేరే దేశాల సరుకులు పొందుతూనే ఉన్నారు. ఇప్పుడు ఎవరూ అనలేరు మాకు కూరగాయలు మరియు శాకాహార వస్తువులు లభించటంలేదని.
కాని నేటి మనిషి ఫ్యాషన్ కొరకు మాంసాహారం తింటున్నాడు. మనుషులు ఇతరుల అభిరుచులను కాపీకొడుతూ ఇలాంటి వేషాలు వేస్తున్నారు.నిజానికి వారు అంతర్గతంగా ఇష్టపడరు.

మీకొ వింత విషయం తెలియచేస్తాం.... మీరు నమ్మరు ఈ విషయాలను..... కాని ఇవన్నీనిజాలే. " అన్ని మతాలూ మానవులకు మంసాహారాన్ని నిషేధించాయి."

ప్రపంచంలోని అన్ని గ్రంథాలు ప్రతిజీవి లోను భగవంతుని ప్రతిరూపాన్ని వీక్షించమనీ, అహింస పరమోత్తమైనదని ఉద్భోదించాయి. సర్వ మతాలు అమయక జీవులకు హాని కలిగించడం మరియు చంపడం లాంటివి నిషేధించాయి.
హిందూ మతం:

భగవద్గీతలో శ్రీకృష్ణుదు 6-32 శ్లోకంలో
"ఓ అర్జునా! ఎవడు సమస్త భూతముల ( ప్రాణుల) యొక్క సుఖ దుఖాలు, తన సుఖ దుఖాలుగా చూస్తాడో అట్టివాడు అందరిలో నాకు ఎక్కువ ప్రియుడు. ఇది నా నిశ్చితాభిప్రాయం. "

భీష్మ:
"మాంసం తినేవారు, మాంసాన్ని విక్రయించేవారు, మరియు మాంసం కోసం జంతువులను వధించేవారు పాపాత్ములు. "

వీరబ్రహ్మేంద్రస్వామి:

" జీవులను వధించి జీవికి వేసినా
జీవ దోషములను జిక్కువడును;
జీవహింస చేత చిక్కునా మోక్షంబు !"

ఇస్లాం మతం:

" భగవంతుడు మీరు సమర్పించే మాంసాన్ని, రక్తాన్ని ఇష్టపడడు. ఆయన పట్ల మీ విశ్వాసాన్ని మాత్రమే కోరుకుంటాడు " - ఖురాన్ 22:37
ఇస్లాం యొక్క సమస్త సూఫి యోగులు సద్గుణవంతులుగా జీవించడం, త్యాగ నిరతితో మరియు కరుణాంత రంగంతో జీవించడం, సాధారణ ఆహారం భుజించడం మరియు మాంసం వదలటం ప్రముఖంగా పేర్కొన్నారు. వారు స్వయంగా మాంసాన్ని త్యజించారు.
షేక్ ఇస్మాయిల్, ఖాజా మొయినుద్దీన్ చిస్తీ, హజ్రత్ నిజాబుద్దీన్ ఔలియా, ఖలందర్, షా ఇనాయత్, మీర్ దాద్, షా అబ్దుల్ కరీం మున్నగు సూఫీ భక్తులు ధర్మబద్ధంగా జీ వించతం, సకల జనులపై ప్రేమ మరియు ఆదరణ, మరియు శాకాహారం గురించి చెప్పారు.
కబీర్ -
" ఉపవాసాన్ని ( రోజా ) పాటించే ఉపాసకుడు మాంసం రుచిని ఆస్వాదించేందుకు, జీవుల్ని వధిస్తే, అతని ఉపవాస వ్రతం నిష్ప్రయోజనమవుతుంది, అల్లా ఈ ప్రవర్తనను అంగీకరించడు. "

క్రైస్తవ మతం:

చంపబడిన జంతువుల మాంసం శరీరంలో ఉంటే ఆ శరీరం సమాధి లాంటిది. ఎవరైతే చంపుతారో వారు నిజానికి తమనే చంపుకుంటున్నారు. చంపబడిన వాటి మాంసం తినేవారు మృ త శరీరాలను తింటున్నట్లే
" ఏ జీవినీ చంపే హక్కు ఎవరికీ లేదు " - జీసస్ క్రైస్ట్

జీసస్ కు సన్నిహిత శిష్యుడైన సెయింట్ మాథ్యు మాంసాహారాన్ని ఆధ్యాత్మిక పతనాననికి సూచనగా భావించేవారు. వారు మాంసం తినేవారు కాదు.

ఇక
జైన మతం మరి బౌద్ధ మతాల్లొ మాంసాహారాన్ని భుజించడమన్న ప్రసక్తేలేదు.



ఇక చివరిగా కొందరు మహాత్ముల అభిప్రాయాలను చూద్దాం:

"సాత్విక ఆహారమే మనిషికి సరి అయినది " - రమణమహర్షి, చాణక్య, తిరువల్లువార్

"మానవుడు ఎలాంటి పరిస్థితిల్లోనూ మాంసం తినడం సరికాదు. మనం పశువుల కన్నా ఉన్నతులం, మాంసం తిని నిమ్న శ్రేణికి చెందిన జీవుల వలె ప్రవర్తించడం మనకు యుక్తంకాదు" - మహాత్మాగాంధీ
"జంతువుల పట్ల క్రూరత్వం చూపటం మూర్ఖత్వమే కాక పరమాత్మను అవమానిచడమే అవుతుంది. మాంసం భుజించదం ఒక వ్యక్తి స్వభావాన్ని హింసాత్మకం చేస్తుంది " - స్వామి దయానంద, రజనీష్.
" ఎంతకాలం మానవులు జీవులను హింసిస్తుంటారో, చంపుతుంటారో అంతకాలం యుద్ధాలు ఉంటాయి " - జార్జి బెర్నాడ్ షా
" మన కడుపేమీ ' స్మశానం' కాదు, జంతుకళేబరాలను దాచుకోవడానికి ! " - జార్జి బెర్నాడ్ షా
" పక్షులను చంపి వండుకుని తినేవాడు వసుధ చండాలుడు " !
యోగి వేమన, స్వామి దయానంద
" ఎంతకాలం మానవులు జీవులను హింసిస్తుంటారో, చంపుతుంటారో అంతకాలం యుద్ధాలు ఉంటాయి " - జార్జి బెర్నాడ్ షా

ఈ వ్యాసాన్ని ఇంతటితో ముగిస్తున్నాం... నిజానికి ఇంకా చాలావివరణ అవసరం,..
అందుకోసం మీ నుంచి వచ్చే స్పందనలకు ఇంకొంచెం వివరణను జతచేసి తప్పక జవాబు ఇస్తాము..
మీ ప్రతీ ప్రశ్నకీ, సందేహానికీ, అనుమానానికీ ( మీ కోపాలకూ, అసహనాలకుసైతం ) ప్రతిస్పందన ఉంటుంది.....

మీ స్పందనలకోసం,
saakaahaaram@gmail.com